మాదక ద్రవ్యాల నిర్మూలనకు పటిష్ఠ చర్యలు

మాదక ద్రవ్యాల నిర్మూలనకు పటిష్ఠ చర్యలు

 

అక్షర ఉదయమ్ – గుంటూరు

 

జిల్లాలో మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం పోలీస్ శాఖ పటిష్ఠ చర్యలు కొనసాగిస్తున్నదని గుంటూరు జిల్లా ఎస్పీ శ్రీ వకుల్ జిందల్, ఐపీఎస్ తెలిపారు.

గుంటూరు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మంగళవారం జిల్లా కలెక్టర్ శ్రీమతి తమీమ్ అన్సారీయా, ఐఏఎస్ అధ్యక్షతన జిల్లా మాదక ద్రవ్యాల నియంత్రణ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందల్, జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) జి.వీ. రమణమూర్తి సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.

జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా మాట్లాడుతూ విద్యాసంస్థలు, వసతి గృహాల్లో నిరంతర పర్యవేక్షణ జరిపి మాదక ద్రవ్యాలకు ఆకర్షితులవుతున్న విద్యార్థులను ప్రారంభ దశలోనే గుర్తించాలన్నారు. అలవాటు పడుతున్న యువతకు తగిన కౌన్సిలింగ్, సైకాలజికల్ సహాయం, డీ-అడిక్షన్ సెంటర్లలో చికిత్స అందేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

ఆమె మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పాఠశాలలు, కళాశాలల్లో ఏర్పడిన “ఈగిల్ క్లబ్” నోడల్ అధికారుల వివరాలు పోలీస్ శాఖకు పంపించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. ఈగిల్ క్లబ్‌ల ద్వారా విద్యాసంస్థల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, వాటిపై నివేదికలను తదుపరి సమావేశానికి అందించాలని సూచించారు.

సంక్షేమ హాస్టళ్లలో నిరంతర అవగాహన, పర్యవేక్షణతో విద్యార్థుల్లో మత్తు పదార్థాలపై ఆసక్తిని అరికట్టాల్సి ఉందన్నారు. మత్తు మందుల విక్రయం విషయంలో డ్రగ్ కంట్రోల్ శాఖ తరచుగా తనిఖీలు చేయాలని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల హానికర ప్రభావాలపై విద్యార్థులు, యువతలో విస్తృత ప్రచారం చేయాలని, ఎక్కడైనా మత్తు పదార్థాల వినియోగం, సరఫరా, రవాణా వంటి సమాచారం లభించిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ మాట్లాడుతూ

గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం టాస్క్ ఫోర్స్, పోలీస్ స్టేషన్ సిబ్బంది, ఈగిల్ టీమ్ సమన్వయంతో క‍ఠిన చర్యలు కొనసాగిస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 1 నుండి 28 వరకు 12 కేసులు నమోదు చేసి, 42 మందిని అరెస్టు చేసి, ఒక వాహనాన్ని సీజ్ చేసినట్లు వివరించారు. “సంకల్పం – మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం” పేరుతో యువతలో అవగాహన కార్యక్రమాలను విస్తృత స్థాయిలో నిర్వహిస్తున్నట్లు చెప్పారు.

అనంతరం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీయా, జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ కలిసి పోలీస్ శాఖ రూపొందించిన మాదక ద్రవ్యాల నిర్మూలన ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ జి.వీ.రమణమూర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.