విజయవాడలో రూ.500 కోట్లతో మరో భారీ ఫ్లై ఓవర్
- ఎన్‌హెచ్ – 65 విస్తరణ నేపథ్యంలో విజయవాడలో భారీ ఫ్లైఒవర్ నిర్మాణానికి అడుగులు
- సర్వీస్ రోడ్డుగా మారనున్న ప్రస్తుత రహదారి
- విజయవాడ-హైదరాబాద్ ఎన్‌హెచ్-65 ఆరు వరుసల

అక్షర ఉదయమ్ – విజయవాడ
విస్తరణలో భాగంగా నగర పరిధిలో మరో భారీ పైవంతెన నిర్మాణానికి అడుగులు పడుతున్నాయి. గొల్లపూడి నుంచి కనకదుర్గ వారధి వరకు 5 కి.మీ. మేర దీన్ని నిర్మించే ప్రతిపాదనలను కన్సల్టెన్సీ డీపీఆర్‌లో పొందుపరిచింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చే వారికి ఈప్రాంతంలో ట్రాఫిక్ రద్దీ పరీక్ష పెడుతోంది. ఈ పైవంతెన నిర్మిస్తే సాఫీగా రావచ్చు. ప్రస్తుత రహదారిని సర్వీస్ రోడ్డుగా మారుస్తారు.
ఆరు లైన్ల విస్తరణకు అవసరమైన భూమి వెడల్పు (ఆర్‌ఓడబ్ల్యూ) 60 మీటర్లు ఉండాలి. ఇక్కడ 40-50 మీటర్ల మధ్యలో ఉంది. రహదారి పక్కన భూమి మార్కెట్ విలువ గజం దాదాపు రూ.లక్ష ఉంది. ఈ ఐదు కిలోమీటర్లు భూమి సేకరించి విస్తరించాలంటే రూ.1000 కోట్లు అవసరమని ఎన్‌హెచ్ అంచనా. పైవంతెన అయితే రూ.500 కోట్లు అవసరమవుతుంది. అంతే కాకుండా అన్ని విధాలుగా ప్రయోజనం కూడా ఉంటుంది. ఈ ప్రాంతం దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలకు కేంద్రం. దీనికితోడు ఆవాస గృహాలు సైతం ఉన్నాయి. అయితే విస్తరణ నేపథ్యంలో భూమిని సేకరిస్తే ఇవన్నీ తొలగించాల్సి ఉంటుంది.
*ట్రాఫిక్ రద్దీ నేపథ్యంలో భారీ పైవంతెన నిర్మాణం కష్టమని భావించినప్పటికీ ఒకవైపు ట్రాఫిక్ వదిలి మరోవైపు నిర్మించాలని నిర్ణయించారు. ప్రస్తుత డీపీఆర్ ప్రాజెక్టు అప్రైజల్ అండ్ టెక్నికల్ స్క్రూటినీ కమిటీ(పీఏటీఎస్‌సీ) ఎదుటకు వెళ్లింది. అక్కడ ఆమోదిస్తే మిగిలిన దశల్లో పరిశీలన పూర్తయ్యాక 2026వ సంవత్సరం ఏప్రిల్ నాటికి పనులు మొదలయ్యే వీలుంది. విజయవాడ – హైదరాబాద్ మార్గంలో మొత్తం 221.5 కిలోమీటర్లను ఆరు వరుసలుగా విస్తరించాలని జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందుకు అనుగుణంగా తొలుత ఈ రహదారిలో కేవలం హైదరాబాద్ సమీపంలోని దండు మల్కాపూర్ నుంచి జగ్గయ్యపేట మండలం అనుమంచిపల్లి వరకూ విస్తరించాలని తీసుకున్న నిర్ణయాన్ని కేంద్రం సవరించింది. అనుమంచిపల్లి నుంచి గొల్లపూడి వరకూ ఆరువరుసలకు రోడ్డును విస్తరించనున్నారు.
తొలుత దండు మల్కాపూర్ నుంచి జగ్గయ్యపేట వరకూ విస్తరణ పనులను చేపట్టేందుకు అనుకూలంగా 181.5 కిలోమీటర్లకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారు చేయాలని ఆదేశాలను ఇచ్చారు. కానీ ప్రజాప్రతినిధుల ఒత్తిడి, ట్రాఫిక్ రద్ధీని దృష్టిలో ఉంచుకుని గొల్లపూడి వరకూ విస్తరించాలని నిర్ణయించి మరో 40 కిలోమీటర్ల పెరుగుదలకు అనుగుణంగా డీపీఆర్ రూపొందించాలని నిర్ణయించడం గమనార్హం. డీపీఆర్ రూపకల్పనకు ఈనెల 24ను తుది గడువుగా నిర్ణయిస్తూ తాజా టెండర్లకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.