7 గురు యువకులను అదుపులోకి తీసుకున్న నల్లపాడు పోలీసులు

7 గురు యువకులను అదుపులోకి తీసుకున్న నల్లపాడు పోలీసులు

 

 

అక్షర ఉదయమ్ – గుంటూరు

 

గంజాయి వినియోగం, విక్రయం, సరఫరా వంటి మాదకద్రవ్య కార్యకలాపాలను పూర్తిగా అరికట్టే లక్ష్యంతో గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. ఆ కార్యక్రమంలో భాగంగా “సంకల్పం – మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా పోరాటం” అనే అవగాహన కార్యక్రమం జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో కొనసాగుతోంది.

ఈ నేపథ్యంలో నల్లపాడు పోలీస్ స్టేషన్ పరిధిలోని మిర్చి యార్డ్ సమీపంలోని ఒక కాలేజీ వద్ద గంజాయి తాగుతున్న ఏడుగురు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని సోదా చేయగా వారి వద్ద రెండు ప్యాకెట్లలో కలిపి 20 గ్రాముల గంజాయి లభించింది. వెంటనే వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు చేపట్టారు.

ఈ సందర్భంగా నల్లపాడు సీఐ వంశీధర్ మాట్లాడుతూ, తమ పరిధిలో గంజాయి విక్రయం, వినియోగం, సరఫరా జరగకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. గంజాయి కార్యకలాపాల్లో నేరస్తులుగా ఉన్న వారిపై గట్టి నిఘా ఉంచి తరచూ ఆకస్మిక సోదాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇలాంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో ఎవరైనా పాల్గొంటే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.