లోక్ భవన్‌గా గవర్నర్ నివాసాలు

అక్షర ఉదయమ్ – న్యూఢిల్లీ
దేశవ్యాప్తంగా గవర్నర్ల అధికారిక నివాసాలైన రాజ్ భవన్లు ఇకపై లోక్ భవన్‌లుగా పిలువబడనున్నాయి. కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచనల మేరకు రాజ్ భవన్ అనే పేరుకు బదులుగా లోక్ భవన్ అనే నూతన నామకరణం అమల్లోకి వచ్చింది.
ప్రజా కేంద్రిత పరిపాలన భావజాలాన్ని ప్రతిబింబించేందుకు, వలస పాలనకు సంబంధించిన రాజ్ అనే పదాన్ని తొలగిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో పశ్చిమబెంగాల్, ఒడిశా, గుజరాత్, తమిళనాడు, కేరళతో పాటు పలు రాష్ట్రాలు ఇప్పటికే అధికారికంగా రాజ్ భవన్ పేరును లోక్ భవన్‌గా మార్చాయి.
తెలంగాణలో కూడా గవర్నర్ అధికారిక నివాసమైన రాజ్ భవన్‌ను లోక్ భవన్‌గా పునర్నామకరణం చేస్తూ రాష్ట్ర రాజ్ భవన్ నుంచి ప్రకటన వెలువడింది. ఈ పేరు మార్పు వెంటనే అమల్లోకి వస్తుందని, భవిష్యత్‌లో అన్ని ప్రభుత్వ రికార్డులు, పత్రాలు, బోర్డులు, వెబ్‌సైట్లు ఈ కొత్త పేరుతోనే ఉండాలని అధికారిక ప్రకటనలో పేర్కొన్నారు.