జాతీయ రహదారిపై బైక్ విన్యాసాలు చేసిన యువకుడి పై కేసు నమోదు

అక్షర ఉదయమ్ – మంగళగిరి
గుంటూరు – విజయవాడ జాతీయ రహదారిపై అత్యంత ప్రమాదకరంగా స్కూటీపై విన్యాసాలు (స్టంట్స్) చేసిన యువకుడిపై గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాల మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి, కౌన్సెలింగ్ నిర్వహించారు. విజయవాడకు చెందిన కొండపల్లి రమేష్ బాబు అనే యువకుడు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో స్కూటీ (AP39 QJ 8591)పై ప్రయాణిస్తూ చేతులు వదిలి పెట్టి నడపడం, స్కూటీపై పడుకుని కాళ్లతో నడపడం, స్కూటీ పై ఒక వైపు కూర్చొని నడపడం వంటి పలు ప్రమాదకర విన్యాసాలు చేశాడు.
నాగార్జున యూనివర్సిటీ, కాజా టోల్ ప్లాజా, చిన కాకాని ప్రాంతాల్లో చేసిన ఈ విన్యాసాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఈ ఘటన జిల్లా ఎస్పీ దృష్టికి చేరింది. ఎస్పీ ఆదేశాల మేరకు మంగళగిరి రూరల్ ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ దర్యాప్తు చేపట్టి రమేష్ బాబును గుర్తించారు. విచారణలో రమేష్ బాబు ఇబ్రహీంపట్నం వద్ద కార్ మెకానిక్‌గా పనిచేస్తూ ఆకతాయితనంగా స్కూటీలు, బైకులపై విన్యాసాలు చేస్తానని, వాటి వీడియోలను తానే స్వయంగా సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేస్తున్నానని అంగీకరించాడు.
ఈ ఘటనపై స్పందించిన ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ మాట్లాడుతూ, ఇలాంటి స్టంట్లు యువతను ఆకర్షించి ప్రమాదాలకు, ప్రాణనష్టాలకు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఇలాంటి విన్యాసాలు ఎవరైనా చేస్తే వారిపై తప్పనిసరిగా కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్సై చిరుమామిళ్ల వెంకట్ స్పష్టం చేశారు.
పోలీసుల కౌన్సెలింగ్ అనంతరం రమేష్ బాబు తాను చేసిన విన్యాసాలు ప్రమాదకరమైనవని, చట్టవిరుద్ధమైనవని అంగీకరించి ఇకపై ఇలాంటి తప్పులు చేయనని పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు. అంతేకాక, ఇతర యువత కూడా ఇలాంటి విన్యాసాలకు పాల్పడకూడదని, ప్రాణాలను ప్రమాదంలోకి నెట్టుకోకూడదని విజ్ఞప్తి చేశాడు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..