రెరా ఫిర్యాదులను సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలి
– రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ పరిధిలోకి అన్ని లేఅవుట్లను, నిర్మాణాలను తీసుకురావాలి
– సెమీకండక్టర్ ఎకో సిస్టమ్ ను పెంచుతూ పారదర్శకతో కూడిన మంచి పాలన అందజేయాలి
– జాతీయ ప్రాజక్టులను సత్వరమే పూర్తి చేసే అంశంపై సి.ఎస్.లు చొరవ చూపాలి
– జాతీయ ప్రాజక్టుల పురోగతిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ

అక్షర ఉదయమ్ – అమరావతి
రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ కి అందే ఫిర్యాదులను అన్నింటినీ ఫిర్యాదు దారులు సంతృప్తి చెందే విధంగా పరిష్కరించి, వారి నుంచి సంతృప్తి లేఖను తీసుకోవాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదేశించారు. కొనుగోలుదారులకు ఎటువంటి అన్యాయం జరగకుండా అన్ని లే అవుట్లను, నిర్మాణాలను రెరా (RERA) పరిధిలోకి తీసుకు వచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం వీడియో కాన్పరెన్సు నిర్వహించి, పలు జాతీయ ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్బంగా దేశ ప్రధాని మాట్లాడుతూ రెరా చట్టాన్ని పటిష్టంగా అమలు పర్చాలని, అది రెగ్యులేటరీ అథారిటీ మాత్రమే కాదని, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలను ప్రమోట్ చేసే సంస్థ అని కూడా అనే విషయాన్ని గుర్తించాలన్నారు. అన్ని రాష్ట్రాల్లో సెమీకండక్టర్ ఎకో సిస్టమ్ ను పెంచుతూ పారదర్శకతో కూడిన మంచి పాలన ప్రజలకు అందజేయాలన్నారు. ఉత్తర ప్రదేశ్, బీహార్, ఝూర్ఖండ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు సంబంధించిన వారణాసి – రాంచీ – కోల్ కతా జాతీయ రహదారి ఎన్.హెచ్.-319బి పురోగతిపై ప్రధాని సమీక్షిస్తూ జాతీయ ప్రాజెక్టులను సత్వరమే అమలు పర్చే అంశంపై అన్ని రాష్ట్రాల సి.ఎస్.లు ప్రత్యేక చొరవ చూపాలని, లేకుంటే ప్రాజక్టుల నిర్మాణ వ్యయం పెరిగి పోతుందనే విషయాన్ని సి.ఎస్.లు అందరూ గుర్తించాలని అన్నారు. మహి బన్స్వరా రాజస్థాన్ అటామిక్ పవర్ ప్రాజక్టు పురోగతిపై సమీక్షిస్తూ ప్రాజక్టు నిర్మాణంలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని ఆదేశించారు. దేశ వ్యాప్తంగా వందకు పైగా న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టులను నిర్మించాలనే లక్ష్యంతో ఉన్నామని, ఈ లక్ష్యాన్ని సాధించేందుకు వీటి నిర్మాణంపై ఐటిఐల్లో కూడా కోర్సులను ప్రవేశ పెట్టనున్నాం అని అన్నారు. ఒడిస్సాకు చెందిన ఇంటిగ్రేటెడ్ ఆనందపూర్ బ్యారేజ్ ప్రాజెక్టు పురోగతిని సమీక్షిస్తూ ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేసేందుకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ వీడియో కాన్పరెన్సులో దేశ ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ఆయా శాఖలు, ప్రాజెక్టులకు చెందిన ఉన్నత అధికారులు డిల్లీ నుండి పాల్గొనగా, రాష్ట్ర నుండి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్, రాష్ట్ర వైద్య, ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ స్పెషల్ సిఎస్ ఎంటి కృష్ణబాబు, రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ది శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్, ఐ.టి.ఇ. అండ్ సి శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..