అడవిలో బండరాయిపై వింత రాతలు పరిశీలించగా వెలుగులోకి ఆశ్చర్యకర విషయాలు

అడవిలో బండరాయిపై వింత రాతలు పరిశీలించగా వెలుగులోకి ఆశ్చర్యకర విషయాలు

 

 

అక్షర ఉదయమ్ – డోర్నాల

 

ఏపీలోని ప్రకాశం జిల్లా దోర్నాల గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో ఓ బండ రాయిపై చెక్కిన తెలుగు శాసనం వెలుగులోకి వచ్చింది. ఈ శాసనం స్వచ్ఛమైన తెలుగు భాషలో వ్రాయ బడింది. చెంచులు ఈ శాసనాన్ని గుర్తించి ఫోటోలు తీయడంతో, వీటిని పరిశీలనకు పంపగా ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ప్రకాశం జిల్లా డోర్నాల గ్రామానికి సమీపంలో ఉన్న నల్లమల అడవిలో ఓ చెట్టు కింద నంది విగ్రహం, కొన్ని పెద్ద పెద్ద బండరాళ్ళు ఉన్నాయి. అడవిలో తిరుగుతున్న చెంచు గిరిజనులు వీటిని చూశారు. ఓ రాయిపై ఏవో అక్షరాలు చెక్కి ఉండటాన్ని గమనించి ఫోటోలు తీశారు. వాటిని సోషల్‌ మీడియాలో పెట్టి ఇవేంటో చెప్పుకోండి చూద్దాం..? అంటూ పజిల్‌ విసిరారు. సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన ఈ ఫోటోలను చారిత్రక పరిశోధకులు తురిమెళ్ళ శ్రీనివాస ప్రసాద్ చూసి వీటిని రాజుల కాలంలో రాతిపై చెక్కిన శాసనాలుగా గుర్తించారు. ఈ రాయిపై చెక్కిన అక్షరాలు శ్రీకృష్ణ దేవరాయలు కాలం నాటి లిపిగా గుర్తించారు. ఈ ఫోటోలను భారత పురావస్తు అధికారులకు పంపించారు. అక్కడ వాటిని పరిశీలించి, ఇవి 1518 సంవత్సరం నాటివని నిర్ధారించారు.

విజయనగరాన్ని పరిపాలించిన శ్రీ కృష్ణ దేవరాయల కాలంలో శ్రీశైలంలో నిత్య పూజలతో అంగరంగ వైభవంగా అలరారు తుండేది. పూర్వం శ్రీశైలం వెళ్లాలంటే కాలి నడకన పోవాల్సిందే. దట్టమైన నల్లమల అడవిలో క్రూర మృగాలతో సావాసం చేస్తూ రాత్రింబవళ్లు నడుచుకుంటూ యాత్రికులు శ్రీ పర్వతం చేరే వాళ్ళు. ఆ సమయంలో గుంపులు గుంపులుగా వెళ్లే భక్తులకు ఆహారం నీరు అంతగా లభించేది కాదు. ఆహార పదార్థాలన్నీ మూటలు కట్టుకుని తీసుకుని వెళ్లేవారు. కానీ నీరు మాత్రం దొరికేది కాదు. ఆ సమయంలో చాలా మంది వీర శైవ భక్తులు పుణ్యం కోసం బాటసారులకు సహాయం చేసేవారు. బావులు త్రవ్వించడం, సత్రాలు నిర్మించడం, జంతువుల బారి నుంచి రక్షించడం, దారి దోపిడీ దొంగల నుంచి కాపాడటం వంటివి చేసే వారు. అలా ఓ మహానుభావుడు ఓ బావి తవ్వించి అక్కడ ఒక శాసనం వేయించాడు. అదే ఇప్పుడు గిరిజనులు గుర్తించి వెలుగులోకి తీసుకువచ్చారు.

శాసనంలో ఏముంది..

శక సంవత్సరం 1440 (క్రీ.శ. 1518)లో ఈ శాసనం లిఖించ బడింది. జ్ఞానంలో ధన వంతుడు, సిద్ధ భిక్షావృత్తి అయ్య వారి శిష్యులు కెమిదేవుని ఇమ్మడి లింగయ్య గారి స్నేహితుడు వెలగా పార్వతి నాయిని ఈ శాసనం వేయించారు. శ్రీశైల స్వామి వారికి, తమ గురువులు కెమిదేవుని వారికి, తమ స్వామి ఇమ్మడి లింగయ్య గారికి, తన తల్లిదండ్రులు తమ్మినేని సిద్దమ్మకు, తన పెద్ద భార్య యెల్లమ్మకు పుణ్యంగా శ్రీశైలం కాలి బాటన వెళ్లే భక్తుల కొరకు బావి త్రవించారు. దాని చుట్టూ కలజు (అరుగు) కట్టించి ఈ పరిసరాల్లో లభించే నిధి, నిక్షేపాలు మొత్తం శ్రీశైలం శ్రీ మల్లికార్జున స్వామి వార్లకు అంకితం చేస్తున్నట్టు లిఖించారు. శ్రీపర్వత మల్లికార్జున దేవుని సేవకు వచ్చే వారి కోసం బావులు, సత్రాలు నిర్మించడం ఆనాటి కాలంలో పుణ్యంగా భావిస్తారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..