ఏపీ మున్సిపల్ వార్డుల పునర్విభజనకు లైన్ క్లియర్
- వార్డుల పునర్విభజనను సవాల్ చేస్తూ దాఖలైన 50 పిటిషన్లు కొట్టివేత
- డీలిమిటేషన్ ప్రక్రియ వల్ల స్థానిక సంస్థల భౌగోళిక సరిహద్దుల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసిన హైకోర్టు
- అక్షర ఉదయమ్ – అమరావతి
రాష్ట్ర వ్యాప్తంగా నగర పాలక సంస్థలు, పురపాలక సంఘాలు, నగర పంచాయతీలలో వార్డుల పునర్విభజన ప్రక్రియను సవాలు చేస్తూ దాఖలైన 50 వ్యాజ్యాలను ఏపీ హైకోర్టు కొట్టేసింది. వార్డుల పునర్విభజన ప్రక్రియ చేపట్టినంత మాత్రాన ఆయా స్థానిక సంస్థల భౌగోళిక, ప్రాంతీయ సరిహద్దుల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకోవని స్పష్టం చేసింది. ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్లకు స్పష్టమైన భౌగోళిక సరిహద్దులు, నిర్దిష్ట అధికార పరిధులు ఉంటాయని తెలిపింది.
పన్నుల వసూలు, అభివృద్ధి పనులు, మౌలిక వసతుల కల్పన విషయంలో యూనిట్‌గా పరిగణించి పరిపాలనా పరమైన ఉత్తర్వులు ఇచ్చేందుకు వెసులుబాటు ఉంటుందని పేర్కొంది. పలు మున్సిపాలిటీలు, గ్రామ పంచాయితీల్లో వార్డుల పునర్విభజనపై దాఖలైన పిటీషన్లపై హైకోర్టు విచారణ జరిపింది. పన్నుల వసూళ్లు, మౌలిక సదుపాయాల కల్పన వ్యవహారంలో గ్రామ పంచాయతీలు నేరుగా నిర్ణయం తీసుకుంటాయని, ఈ నేపథ్యంలో గ్రామ పంచాయతీ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్ నిర్వచనం పరిధిలోకి వస్తుందని తెలిపింది.
జనాభా లెక్కల కోసం అయితే కార్పొరేషన్లలో ఉండే వార్డులు భౌగోళికంగా గ్రామ పంచాయతీల కంటే పెద్దవి అయినప్పటికీ పరిపాలన అధికారాలు వాటికి లేనందున అడ్మినిస్ట్రేటివ్ యూనిట్‌గా పరిగణించ లేమని పేర్కొంది. జనాభా లెక్కల కోసం అడ్మినిస్ట్రేటివ్ యూనిట్లు సరిహద్దులను స్తంభింప చేస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన సర్క్యులర్ కేవలం జనాభా లెక్కలు, సమాచార సేకరణకు మాత్రమే వర్తిస్తుంది తప్ప ఆ సర్క్యులర్‌ను వార్డుల పునర్విభజనకు అన్వయించ లేమని తేల్చి చెప్పింది.
వార్డుల పునర్విభజన వల్ల భౌగోళిక సరిహద్దులలో మార్పులు చోటు చేసుకోక పోవడంతో పిటిషనర్లకు ఎలాంటి నష్టం జరగదని తెలిపింది. స్థానిక సంస్థల ఎన్నికలలో ఓటు వేసే ప్రాథమిక హక్కుకు ఎలాంటి భంగం కలగదని వెల్లడించింది. వార్డుల పునర్విభజనకు, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల ఓటింగ్‌కు ప్రస్తుతం జరుగుతున్న జనాభా లెక్కల సేకరణను ముడి పెట్టలేము అంది. వార్డుల పునర్విభన విషయంలో పిటిషనర్లకు అభ్యంతరాలు సమర్పించేందుకు వెసులుబాటు ఉంటుందని ఏజీ చెబుతున్నారని గుర్తుచేసింది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని వ్యాజ్యాలు అన్నింటిని కొట్టేస్తున్నట్లు ప్రకటించింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.హరినాథ్ ఈమేరకు తీర్పు ఇచ్చారు.
- గంపగుత్తగా వ్యాజ్యాలు
గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్‌లో (జీవీఎంసీ), మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ (ఎంఎంసీ)తో పాటు వైఎస్సార్ కడప, కృష్ణా, విశాఖపట్నం, చిత్తూరు, తూర్పు, పశ్చిమ గోదావరి, అనంతపురం, ప్రకాశం, గుంటూరు, కర్నూలు, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలలో వార్డుల విభజన ప్రక్రియకు సంబంధించిన జీవోలు, ప్రాథమిక నోటిఫికేషన్లను సవాలు చేస్తూ హైకోర్టులో గంపగుత్తగా వ్యాజ్యాలు దాఖలయ్యాయి. పిటిషనర్ల తరపున సీనియర్ న్యాయవాది కేఎస్ మూర్తి, తదితరులు వాదనలు వినిపించారు.
దేశంలో జనగణన – 2027కి సంబంధించి కేంద్రం ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసినందున వార్డుల సరిహద్దులను మార్చడానికి వీల్లేదన్నారు. ప్రస్తుతం ఉన్న మున్సిపాలిటీలు, రెవెన్యూ గ్రామాలు, సబ్ డివిజన్లు, జిల్లాల సరిహద్దుల్లో మార్పులు చేయడానికి ఉద్దేశించిన ప్రతిపాదనలను 2025 డిసెంబర్ 31 నాటికి ఆమోదించి, అమల్లోకి తీసుకు రావాలని కేంద్ర రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల (సీఎస్)కు స్పష్టం చేస్తూ 2025 జూన్ 27న సర్క్యులర్ ఇచ్చారని అన్నారు. అంతేకాక 2026 జనవరి 1 నుంచి 2027 మార్చి 31 వరకు పరిపాలన విభాగాల సరిహద్దుల్లో (బౌండరీస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్) మార్పులు చేయకూడదని స్పష్టం చేశారన్నారు. వార్డుల పునర్విభజన ప్రక్రియను రద్దు చేయాలని కోరారు.
- మినహాయించడం జరగదు
రాష్ట్ర ప్రభుత్వం, అధికారుల తరపున అడ్వొకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. గత ఏడాది ఆగస్టు 13న సెన్సస్ కమిషనర్ ఇచ్చిన కార్యనిర్వాహక సూచనలు (ఎగ్జిక్యూటివ్ ఇన్‌స్ట్రక్షన్స్), మున్సిపల్ పాలన, ఎన్నికల విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న రాజ్యాంగ, చట్టబద్ధమైన అధికారాలపై పైచేయి సాధించ లేవని అన్నారు. వార్డుల పునర్విభజన ప్రక్రియ వల్ల ఏ గ్రామాన్ని, పంచాయతీని, మున్సిపాలిటీని, నగర పంచాయతీలను చేర్చడం లేదా మినహాయించడం జరగదన్నారు.
భౌగోళిక సరిహద్దులో ఎలాంటి మార్పు ఉండదని, సమాన ప్రాతినిధ్యం కల్పించేందుకు మున్సిపల్ కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలోని వార్డులను రీ డివిజన్ చేస్తారన్నారు. పునర్విభజన చేపడితే సెన్సస్ (జనగణన) మార్గదర్శకాల్లో ఉద్దేశించిన పరిపాలన సరిహద్దులు, అధికార పరిధిలో మార్పులు చేసినట్లు కాదన్నారు. వార్డుల పునర్విభజన అనేది మున్సిపల్ కార్పొరేషన్ భౌగోళిక పరిధిలో మార్పు చేయకుండా ఎన్నికల్లో సమాన ప్రాతినిధ్యం కల్పించేందుకు చేపట్టే అంతర్గత ఎన్నికల ప్రక్రియ మాత్రమేనన్నారు. వార్డుల పునర్విభజన ప్రక్రియను నిలువరిస్తే ఎన్నిక నిర్వహణలో జాప్యం జరుగుతుందన్నారు.