ఈసారి కడప క్లీన్ స్వీప్

ఈసారి కడప క్లీన్ స్వీప్

– మహానాడు సూపర్ హిట్

– మీ రుణం తీర్చుకుంటా

– సీఎం చంద్రబాబు

 


అక్షర ఉదయమ్ – కడప

మహానాడు గ్రాండ్ సక్సెస్ అయ్యిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. కడప టీడీపీ మహానాడు బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. ఈ సందర్భంగా జై తెలుగుదేశం అని కార్యకర్తలతో నినాదాలు చేయించారు ముఖ్యమంత్రి. రాయలసీమ గర్జన రాష్ట్రం అంతా మారు మ్రోగాలన్నారు. జన సంద్రంగా కడప నిండి పోయిందని చెప్పారు. ఎన్నో సార్లు కడపకు వచ్చానని, ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు టీడీపీ మహానాడుకు రావడం చూసి కొండంత ధైర్యం వచ్చిందన్నారు. కడపలో మహానాడు పెడితే చాలా మంది అనుమానించారని సీఎం తెలిపారు.

పదికి పది గెలుస్తాం

కానీ కడప టీడీపీ అడ్డా అని నిరూపించేందుకే మహానాడు ఇక్కడ పెట్టామన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మొదటి మహానాడు దేవుని గడపలో జరిగిందని.. రెస్పాన్స్ అదిరిందన్నారు. మహానాడు సూపర్ హిట్ అయ్యిందని అన్నారు. కడప రాజకీయం మారబోతోందని, కడప గడపలో మార్పు కనిపిస్తుందని గత ఎన్నికల ప్రచారంలో చెప్పానని అన్నారు. అహంకారంతో విర్ర వీగే వారికి ఎన్నికల్లో కడప జిల్లా ప్రజలు అద్భుతమైన తీర్పును ఇచ్చారని కొనియాడారు. ఈ ఎన్నికల్లో కడపతో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో అద్భుతమైన విజయం సాధించామన్నారు. ఉమ్మడి కడపలో పదికి ఏడు స్థానాలు గెలిచామని చెప్పుకొచ్చారు. ఇప్పటి నుంచి కష్ట పడితే 2029 ఎన్నికల్లో పదికి పదికి స్థానాలు గెలుచుకుంటామని ముఖ్యమంత్రి ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల్లో రాయలసీమ ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారని, 52 సీట్లకు 45 సీట్లతో కూటమిని గెలిపించారన్నారు. వైసీపీకి రాయలసీమలో ఏడు సీట్లు వస్తే టీడీపీ కూటమికి ఒక్క ఉమ్మడి కడప జిల్లాలోనే ఏడు సీట్లతో గెలిపించారన్నారు. ఈ తీర్పును మనం అర్థం చేసుకున్నామని.. కానీ ఓడిపోయిన పార్టీ ఇంకా అర్థం చేసుకోలేదని మండి పడ్డారు. టీడీపీ అధికారం కోసం పుట్టిన పార్టీ కాదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

అలాంటి వారు ఉండటం పార్టీకి అదృష్టం

అవమానాలు, అక్రమ కేసులు, నిర్బంధాలు అన్నింటినీ ఎదుర్కొన్నారని, ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందంటే అది కార్యకర్తలు, నేతలు త్యాగాలే అని తెలిపారు. మెజార్టీలు అత్యధికంగా వచ్చాయన్నారు. ఏడాది క్రితం రాష్ట్రం విధ్వంస పాలనతో 30 ఏళ్లు వెనక్కు వెళ్లిందని విమర్శించారు. ‘కష్టాలు, సవాళ్లను చూసి నేను భయ పడలేదు. నేను క్లైమోర్ మైన్‌లకు భయ పడలేదు. వీటికి భయ పడతానా’ అని ప్రశ్నించారు చంద్రబాబు. సైకిళ్లు వేసుకుని కడప మహానాడుకు వచ్చారంటూ.. కోడూరు నుంచి సైకిల్ వేసుకుని వచ్చిన వ్యక్తిని సభా వేదికపై సీఎం చూపించారు. ఇటువంటి కార్యకర్తలు ఏ పార్టీకైనా ఉంటారా అని ప్రశ్నించారు. ఇటువంటి కార్యకర్తలు ఉండటం పార్టీకి అదృష్టం అని అన్నారు.

భూ సమస్య లేకుండా చేస్తా

అన్న క్యాంటీన్లు తెరవడం, రోడ్లు బాగుచేయడం, పెన్షన్లు 4 వేలు చేయడం, దేవాలయాల్లో అన్నదానం ప్రారంభం విషయాన్ని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గుర్తు చేశారు. కేంద్ర పథకాలు నిధులు డైవర్ట్ చేశారని మండి పడ్డారు. తాను వెంటనే పథకాలను పునరుద్ధరించానని తెలిపారు. తెలుగుదేశం అంటేనే బీసీల పార్టీ అని, బీసీల కోసం బడ్జెట్‌లో రూ.47 వేల కోట్లు పెట్టామని చెప్పారు. పలు బీసీ వర్గాలకు ఇచ్చిన పథకాలను సీఎం గుర్తు చేశారు. సూర్యఘర్ పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు ఫ్రీగా సోలార్ విద్యుత్ ఇస్తామన్నారు. రైతులకు వ్యవసాయ పంపు సెట్లు వద్ద సోలార్ విద్యుత్ పెట్టుకోవాలని సీఎం చెప్పారు. ఉద్యోగులను గత ప్రభుత్వం అవమానాలకు గురి చేసిందని, కానీ ఇప్పుడు ఒకటవ తేదీన జీతాలు ఇస్తున్నామని తెలిపారు. వారికి ఇప్పుటికే రూ.7 వేల 500 కోట్లు బకాయిలు ఇచ్చామన్నారు. కూటమి రాగానే ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దు చేశామని తెలిపారు. రాబోయే మహానాడుకు భూ సమస్యలు లేకుండా చేస్తానంటూ ఈ సందర్భంగా సీఎం హామీ ఇచ్చారు.

ఇక్కడ ఉంది సీబీఎన్.. గుర్తు పెట్టుకోండి

దేశానికి టెర్రరిస్టుల వలన చాలా నష్టం జరుగుతోందని అన్నారు. మన దేశంలో, రాష్ట్రంలో ఆర్థిక ఉగ్రవాదులు వలన నష్టం కలుగుతోందని అన్నారు. నాసిరకం మద్యం వలన ఆరోగ్య సమస్యలు తలెత్తాయని అన్నారు. గంజాయి వలన అనేక మంది భవిష్యత్ నాశనం అయిందని అన్నారు. అడవులను ఆక్రమించుకొని ఎస్టేట్‌లు కడతారని ఫైర్ అయ్యారు. ‘ఆర్థిక ఉగ్రవాదులు గుండెల్లో రైళ్లు పరిగెట్టిస్తా. డ్రగ్స్ అమ్మే వారికి అదే చివరి రోజు అవుతుంది. ఇక్కడ ఉంది సీబీఎన్‌ అని గుర్తు పెట్టుకోండి’ అంటూ సీఎం చంద్రబాబు హెచ్చరించారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..