కృష్ణమ్మ ఒడిలో యోగా సవ్వడి
- చిరుజల్లుల నడుమ యోగాతో తడిసి ముద్దయిన నదీ తీరం
- వాటర్ క్రాఫ్ట్ – ఫ్లోటింగ్ యోగాలో ప్రపంచ రికార్డు
- మెగా ఈవెంట్‌కు భారీగా తరలి వచ్చిన యోగా ప్రియులు
- జిల్లా కలెక్టర్ లక్ష్మీశపై వెల్లువెత్తిన ప్రశంసలు
- వినూత్న యోగాంధ్ర కార్యక్రమాల్లో ఎన్‌టీఆర్ జిల్లా ముందుంటోందని అభినందనలు

అక్షర ఉదయమ్ – విజయవాడ
బుధవారం తొలి జాము నుంచి చిరు జల్లుల సవ్వడి చేస్తూ కృష్ణా తీరం ఆహ్లాదకర వాతావరణం సంతరించుకుంది. నగరంలోని బెరం పార్కు వద్ద కృష్ణమ్మ తీరం ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ నేతృత్వంలో నిర్వహించిన వాటర్ క్రాఫ్ట్ – ఫ్లోటింగ్ యోగా మెగా ఈవెంట్‌లో పాల్గొనేందుకు యోగా ప్రియులు విశేషంగా తరలి రావడంతో పులకించింది. ఉదయాన్నే బెరం పార్కుకు చేరుకున్న పార్లమెంటు సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని), రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, జీఏడీ – పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా, జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్రలకు యోగా ప్రియులు హర్ష ధ్వానాలతో స్వాగతం పలికారు. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా తరలి వచ్చిన యోగా ఔత్సాహికులు పంట్లు, బోట్లు, స్పీడ్ బోట్లు, కయాక్స్ బోట్లు, శాండ్ బోట్లు, జెట్ స్కీ, లైఫ్ బోట్లు వంటి 201 వాటర్ క్రాఫ్టులతో పాటు నదీ తీర ప్రాంతంలో ఏర్పాటుచేసిన పచ్చని తివాచీలపై 2000 మంది యోగాసనాలు ఆచరించడంతో కృష్ణమ్మ ఒడి పులకించింది. ప్రపంచ రికార్డు సాధించాలన్న జిల్లా యంత్రాంగం ఆశయం నెర వేరింది. యోగాసనాలను ఆద్యంతం నిశితంగా పరిశీలించిన వరల్డ్ రికార్డ్స్ యూనియన్ (డబ్ల్యూఆర్‌యూ) న్యాయ నిర్ణేత షరీఫ్ హానిఫ్.. యోగా కార్యక్రమాన్ని నిర్వహించిన తీరు, యోగాసనాలను ఆచరించిన విధానం, తరలి వచ్చిన ఔత్సాహికులను క్షుణ్నంగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేస్తూ వేలాది మంది హర్షధ్వానాల మధ్య ప్రపంచ రికార్డు సాధించినట్లు ప్రకటించారు. ఓ నదిలో అత్యధిక మందితో వివిధ రకాల అత్యధిక బోట్లపై యోగాసనాలు చేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకున్నట్లు ధృవీకరిస్తూ విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్, జీఏడీ – పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా, ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ, జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎంలకు సర్టిఫికెట్ అందించారు.
కలెక్టర్ అపూర్వ లీడర్‌షిప్ ఫలితం ఈ ప్రపంచ రికార్డు
– న్యాయనిర్ణేత షరీఫ్ హానిఫ్
ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ నేతృత్వం, వారి బృందం అపూర్వ కృషికి ఫలితం ప్రపంచ రికార్డు అని వరల్డ్ రికార్డ్స్ యూనియన్ (డబ్ల్యూఆర్‌యూ) న్యాయ నిర్ణేత షరీఫ్ హానిఫ్ పేర్కొన్నారు. క్రమశిక్షణ, సమష్టి కృషి, నిబద్ధత ఫలితంగా పవిత్ర కృష్ణా నదీ తీరం సరికొత్త ప్రపంచ రికార్డుకు వేదికయిందన్నారు. ఇన్నొవేషన్, హెల్త్, ఫిట్‌నెస్‌తో పాటు పర్యావరణ పరిరక్షణ పట్ల జిల్లా అధికార యంత్రాంగం, ప్రజల చిత్తశుద్ధికి ఇది గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు. ఐక్యత, శ్రేయస్సు, సంస్కృతీ సంప్రదాయాల పట్ల నిబద్ధతను చాటి చెప్పేలా ఈ రికార్డుతో విజయవాడ ప్రజలు గొప్ప సందేశాన్ని ఇచ్చారని.. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికీ వరల్డ్ రికార్డ్స్ యూనియన్ తరపున హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నట్లు షరీఫ్ హానిఫ్ తెలిపారు.
విజయవాడ ప్రజలు చైతన్య వంతులు
– ఎంపీ కేశినేని శివనాథ్
విజయవాడ నగర ప్రజలు ఎంతో చైతన్య వంతులని, అందరికీ ఆదర్శంగా నిలవాలనే తపన వారిలో కనిపిస్తుందని, ఆ నిబద్ధత ఫలితమే నేటి ప్రపంచ రికార్డు అని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. జిల్లా అధికార యంత్రాంగం, వీఎంసీ, ప్రజల సమష్టి కృషితో రికార్డు సొంతమైందని, బెరం పార్కు, పున్నమి ఘాట్ వద్ద నదీ తీరం గతంలోనూ వివిధ ప్రపంచ రికార్డులకు వేదికగా నిలిచిందని.. ముఖ్యమంత్రి ఆశయానికి అనుగుణంగా 5000 డ్రోన్లతో మెగా డ్రోన్ షోతో ప్రపంచ రికార్డులు సాధించినట్లు తెలిపారు. ప్రధాని సమక్షంలో ఈ నెల 21న విశాఖలోనూ అయిదు లక్షల మందితో యోగాసనాలు ఆచరించి ప్రపంచ రికార్డు సాధించే దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. ప్రతి ఒక్కరి జీవితాల్లో యోగా భాగం కావాలని ఎంపీ పిలుపునిచ్చారు.
ఐక్యతకు, సమష్టి కృషికి ప్రతీక ప్రపంచ రికార్డు
– రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్
ఆహ్లాదకర వాతావరణంలో ఎన్‌టీఆర్ జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన మెగా యోగా ఈవెంట్‌లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని, యోగాంధ్ర – 2025లో ప్రపంచ రికార్డు సాధించినందుకు ఆనందంగా ఉందని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా దాదాపు రెండు కోట్ల మంది యోగాలో పాల్గొంటున్నారని అన్నారు. యోగాచరణను ఒక్క రోజుకే పరిమితం చేయకుండా జీవితాంతం యోగాను అనుసరించడం వల్ల ఆరోగ్యంగా, ఆనందంగా ఉంటామన్నారు. ఆంధ్రాను యోగాంధ్రగా మార్చడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని అజయ్ జైన్ పిలుపునిచ్చారు.
యోగాంధ్రలో ముందు వరుసలో ఎన్‌టీఆర్ జిల్లా
– జీఏడీ – పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా
యోగాంధ్రలో భాగంగా ఎన్‌టీఆర్ జిల్లా వివిధ వర్గాల ప్రజలకు యోగాపై అవగాహన కల్పించి, చైతన్యవంతులు చేయడంలో ఎన్‌టీఆర్ జిల్లా ముందు వరుసలో నిలుస్తోందని, ప్రభుత్వం నుంచి ప్రశంసలు అందుకుంటోందని జీఏడీ – పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ముకేష్ కుమార్ మీనా అన్నారు. వాటర్ క్రాఫ్ట్ – ఫ్లోటింగ్ యోగా థీమ్‌ను ఎంపిక చేసుకొని కృష్ణా తీరంలో నిర్వహించిన యోగాసనాల కార్యక్రమం ప్రపంచ రికార్డు సాధించినందుకు గర్వ పడుతున్నట్లు, ఇందుకు కారణమైన జిల్లా యంత్రాంగాన్ని, పాల్గొన్న ఔత్సాహికులకు అభినందనలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. మే 21 నుంచి నిర్వహిస్తున్న యోగాంధ్రలో భాగంగా వినూత్న కార్యక్రమాల నిర్వహణలో ముందున్న జిల్లా ఇప్పుడు సాధించిన ప్రపంచ రికార్డు అందరికీ స్ఫూర్తి దాయకంగా నిలుస్తుందని అన్నారు.
జిల్లా కలెక్టర్ లక్ష్మీశ మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమం ద్వారా గ్రామ, మండల, జిల్లా స్థాయిలో నిత్యం వివిధ వర్గాల ప్రజలతో యోగాసనాల అభ్యసన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అని అన్నారు. యోగాసనాలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తోందని.. టీమ్ ఎన్‌టీఆర్ స్ఫూర్తితో ప్రపంచ రికార్డు సాధించడం సంతోషాన్ని ఇచ్చిందని, ఈ ప్రపంచ రికార్డు జిల్లా అధికారులు, యోగా ఔత్సాహికులు ప్రతిఒక్కరికీ దక్కినట్లు తాను భావిస్తున్నా అని అన్నారు. ఇదే స్ఫూర్తితో యోగాలో జిల్లాలో అగ్ర గామిగా నిలపడంలో లక్ష్యంగా అడుగులు ముందుకు వేస్తామన్నారు. రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం కురుస్తున్నా ఔత్సాహికులు పెద్ద ఎత్తున తరలి రావడం ఆనందం కలిగిస్తోందన్నారు. కృష్ణమ్మ ఒడిలో దుర్గమ్మ పాదాల చెంత భారతీయ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అయిన యోగాసనాలకు పట్టం కట్టడం జీవితంలో మరచిపోలేని సంఘటనగా భావిస్తున్నట్లు కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్ఎం ధ్యానచంద్ర, విజయవాడ ఆర్‌డీవో కావూరి చైతన్య, అమరావతి బోటింగ్ క్లబ్ (ఏబీసీ) సీఈవో తరుణ్ కాకాని, విజయవాడ నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి.చంద్రశేఖర్, ఆయుష్ అధికారులు డా. వి.రాణి, డా. రామత్లేహి, డా. రత్నప్రియదర్శిని, జిల్లా అధికారులు డా. ఎం.సుహాసిని, ఎ.శిల్ప, జి.జ్యోతి, డా. జె.సుమన్, పి.లావణ్య కుమారి, ఏఎన్‌వీ నాంచారరావు, ఎ.రాము, వి.పెద్దిబాబు, తహసీల్దార్లు ఇంతియాజ్ పాషా, రోహిణి దేవి, సుగుణ కుమారి, సూర్యారావు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, యోగా ఔత్సాహికులు పాల్గొన్నారు. ఎస్డీఆర్ఎఫ్, ఈషా ఫౌండేషన్, ఏపీటీడీసీ, అమరావతి యోగా అండ్ ఏరోబిక్ అసోసియేషన్, టూరిజం తదితర విభాగాలు ఏర్పాట్లను సమన్వయ పరిచాయి.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..