మహిళా సాధికారత వారోత్సవాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన బాపట్ల పోలీస్

అక్షర ఉదయమ్ – బాపట్ల

 

మహిళ సాధికార వారోత్సవాల్లో భాగంగా జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఆదేశాల మేరకు జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల్లో వక్తృత్వ పోటీలు నిర్వహించిన జిల్లా పోలీసులు

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ డీజిపి హరీష్ కుమార్ గుప్తా ఐపీఎస్ ఆదేశాల మేరకు, బాపట్ల జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ సూచనలతో జిల్లా పోలీసు శాఖ మార్చి 1వ తేదీ నుండి “మహిళా సాధికారత వారోత్సవాలను” జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు.

“మహిళా సాధికారత వారోత్సవాలలో” భాగంగా మంగళవారం జిల్లా పోలీస్ అధికారులు వారి పోలీస్ స్టేషన్ పరిధిలోని పాఠశాలలు, కళాశాలలో వక్తృత్వ పోటీలు నిర్వహించారు. సోషల్ మీడియాలో మహిళల గోప్యతకు డిజిటల్ భద్రత అవసరం, ఆత్మరక్షణ అనేది ఒక ఎంపిక కాదు అవసరం, మహిళలకు సురక్షితంగా పనిచేసే ప్రదేశం- వేధింపులపై మౌనాన్ని వీడడం, బహిరంగ ప్రదేశాల్లో మహిళలు సురక్షితం-సవాళ్లు వాటి పరిష్కారాలు, మహిళల భద్రతకు భరోసా ఇవ్వడంలో పురుషుల పాత్ర అనే అంశాల పై వక్తృత్వ పోటీలను నిర్వహించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వక్తృత్వ పోటీలలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బహుమతులు అందజేయనున్నారు.

మహిళలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సాధించిన ప్రగతిని గురించి అవగాహన కల్పించడం, మహిళల హక్కులు, సమానత్వం, భద్రత, రక్షణ కోసం పోలీసులు తీసుకుంటున్న చర్యలను తెలియజేయడం, అలాగే మహిళల శక్తిని, మానసిక స్థైర్యాన్ని, స్వీయ రక్షణ సామర్థ్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా పెట్టుకొని ఈ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది.