ఆకస్మికంగా డిపిఓ ను, సోషల్ మీడియా సెల్ ను పరిశీలించిన జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్
సామాజిక మాధ్యమాలలో విద్వేషపూరిత వదంతులను వ్యాపింప చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం
సామాజిక మాధ్యమాల పై సోషల్ మీడియా, సైబర్ సెల్ పోలీసులతో నిఘా ఉంచాం
సిబ్బందికి సంబంధించిన ఫైల్స్ పెండింగ్ లేకుండా సకాలంలో పూర్తి చేయాలి
– జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్

సామాజిక మాధ్యమాలలో విద్వేషపూరిత రెచ్చగొట్టే వదంతులను వ్యాపింప చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ హెచ్చరించారు. గురువారం జిల్లా ఎస్పీ ఆకస్మికంగా జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఉన్న సోషల్ మీడియా, సైబర్ సెల్ విభాగాలను, డీపీఓ లోని వివిధ విభాగాలను తనిఖీ చేశారు.
జిల్లా ఎస్పీ సోషల్ మీడియా, సైబర్ సెల్ విభాగాలను పరిశీలించారు. రెచ్చగొట్టే విధంగా వార్తలను సోషల్ మీడియా వేదికగా వ్యాపింప చేసే వారిని వేగవంతంగా గుర్తించాలని సోషల్ మీడియా సెల్ అధికారులను సిబ్బందిని ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ప్రతి సామాజిక మాధ్యమాన్ని/ గ్రూపులను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. విద్వేషపూరితమైన సమాచారాన్ని సామాజిక మాధ్యమాల వేదికగా పోస్ట్ చేసే వారిని గుర్తించి వారి పూర్తి స్థాయి వివరాలను సేకరించి సంబంధిత స్టేషన్ ఏస్.హెచ్.ఓ ద్వారా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం డీపీఓ లోని వివిధ విభాగాలను తనిఖీ చేశారు. డీపీఓలో పోలీస్ అధికారులకు మరియు సిబ్బంది యొక్క జీతభత్యాలు, టిఏలు, ఇంక్రిమెంట్ లు, ప్రమోషన్లు మొదలైన ఫైల్స్ సకాలంలో పూర్తి చేయాలన్నారు. సర్వీస్ బుక్కులు ఇతర అన్ని రకాల రిజిస్టర్స్ ని అప్ టు డేట్ గా ఉంచాలన్నారు. పోలీసు సిబ్బంది ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా రికార్డులు సక్రమంగా నిర్వహించాలన్నారు. ఇతర శాఖలకు సంబంధించిన రిప్లైలను త్వరితగతిన పంపించాలన్నారు. పోలీస్ సిబ్బందికి సంబంధించిన ఫైల్స్ పెండింగ్ లేకుండా సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని సోషల్ మీడియా మాధ్యమాలపై సైబర్ సెల్, సోషల్ మీడియా పోలీసులతో నిరంతర నిఘా ఉంచామన్నారు. సోషల్ మీడియా వేదికగా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వదంతులు వ్యాపింప చేసినా, ఆడియో, వీడియోల రూపంలో సందేశాలను పోస్ట్ చేసినా ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేసేముందు అది వాస్తవమైనదా కాదా అని నిర్ధారణ చేసుకున్న తర్వాత మాత్రమే పోస్ట్ చేయాలని సూచించారు. ఎవరైనా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా పోస్ట్ చేస్తే సంబంధిత గ్రూప్ అడ్మిన్, నిర్వాహకులు వెంటనే సంబంధిత పోలీస్ అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. లేనియెడల గ్రూప్ అడ్మిన్లు, నిర్వహకులు బాధ్యత వహించవలసి ఉంటుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఏవో శ్రీనివాసరావు, సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ జయ కుమార్, ఐటీ కోర్ ఎస్సై నాయబ్ రసూల్, డిపిఓ సిబ్బంది పాల్గొన్నారు.