
అక్షర ఉదయమ్ – పల్నాడు
పల్నాడు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముప్పాళ్ల మండలం బొల్లవరం వద్ద ట్రాక్టర్ బోల్తాపడి నలుగురు కూలీలు మృతిచెందారు. చాగంటివారిపాలెంకు చెందిన 30 మంది మహిళా కూలీలు వ్యవసాయ పనుల నిమిత్తం బొల్లవరం గ్రామానికి ఇవాళ ఉదయం వెళ్లారు. ఎప్పటిలాగానే రోజంతా పని చేసిన కూలీలు సాయంత్రం సమయానికి ఇంటికి బయలుదేరారు. బొల్లవరంలో ట్రాక్టర్ ఎక్కి కొద్ది దూరం ప్రయాణించే సరికే ప్రమాదవశాత్తూ వారు ప్రయాణించే ట్రాక్టర్ బోల్తాపడింది. ఈ ప్రమాదంలో మధిర గంగమ్మ (55), మధిర సామ్రాజ్యం (50), చెక్కర మాదవి (30), తేనెపల్లి పద్మ (45) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్రగాయాలు అయ్యాయి. స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన సత్తెనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రికి వద్దకు చేరుకుని బోరున విలపిస్తున్నారు. గ్రామానికి చెందిన నలుగురు ఒకేసారి మృతిచెందడంతో చాగంటివారిపాలెంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.