భక్తుల మనోభావాలను గౌరవించడమే నిజమైన ధర్మ రక్షణ
- తిరుమల లడ్డు వ్యవహారంపై మాట్లాడే నైతిక హక్కు వైసీపీకి లేదు.
- రాజకీయాలకతీతంగా మఠాధిపతులు, పీఠాధిపతులు, ధార్మిక పెద్దలతో రౌండ్ టేబుల్ నిర్వహించాలి.
- రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్
అక్షర ఉదయమ్ – తెనాలి
పవిత్రమైన తిరుమల లడ్డు వ్యవహారాన్ని రాజకీయ కక్ష సాధింపుగా మలిచే ప్రయత్నాలను తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తెనాలిలో మీడియాతో మాట్లాడిన మంత్రి, ఇది ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన అంశం కాదని, కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన అత్యంత సున్నితమైన అంశమన్నారు.
తిరుమల లడ్డు విషయంలో కల్తీ జరిగిందన్న అంశంపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన విచారణలో, సీబీఐ నివేదిక స్పష్టమైన వాస్తవాలను వెలుగులోకి తీసుకు వచ్చినప్పటికీ, వైసీపీ నాయకులు ఎదురు దాడి ధోరణితో మాట్లాడటం దుర్మార్గమని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు.
60 లక్షల లీటర్లుగా చెప్పబడిన నెయ్యిలో ఒక్క చుక్క అసలు నెయ్యి కూడా లేదని నివేదిక స్పష్టం చేసిన తరువాత కూడా మాట్లాడే నైతిక హక్కు వైసీపీ నాయకులకు లేదని అన్నారు.
అయోధ్యకు పంపిన లడ్డూల విషయంలో “ప్రత్యేక నెయ్యి వాడాం” అని వైసీపీ నాయకులు చెబుతున్న మాటలే, తిరుమలలో వాడుతున్న నెయ్యి అసలు నెయ్యి కాదన్న విషయం వారికి ముందే తెలుసు అన్న దానికి నిదర్శనమని మంత్రి వ్యాఖ్యానించారు.
నిజంగా అయోధ్యకు పంపిన లడ్డూల కోసం ప్రత్యేకంగా నెయ్యిని తెప్పించారంటే, మిగిలిన లడ్డూల తయారీలో వాడిన పదార్థాల విషయంలో ఐదేళ్లుగా ప్రజలను ఎలా మోసం చేశారో వారు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్లోని ఒక డైరీ సంస్థ నుంచి 1,005 కిలోలు, పలమనేరులోని మరో సంస్థ నుంచి మరో 1,005 కిలోల నెయ్యిని ప్రత్యేకంగా తెప్పించి అయోధ్య లడ్డూల కోసం వాడామని చెప్పడం అత్యంత బాధాకరమని అన్నారు.
తిరుమల లడ్డూలు అన్నీ తిరుమలలోనే తయారు అవుతాయని, వేర్వేరు ప్రాంతాల నుంచి వేర్వేరు పదార్థాలు పంపించి లడ్డూలు తయారు చేయడం సాధ్యమేనా అని ప్రశ్నించారు.
ఈ వ్యవహారాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై వ్యక్తిగత దాడులుగా మలచే ప్రయత్నాలను సమాజం గమనించాలని, ఖండించాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆలోచన ఎప్పుడూ హిందూ ధర్మాన్ని కాపాడడమే తప్ప, ఇతర మతాలను కించ పరచడం కాదని స్పష్టం చేశారు.
తిరుమలలో జరిగిన ఈ తప్పిదంపై సమగ్ర ప్రక్షాళన జరగాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు.
ఈ అంశాన్ని రాజకీయాలకు అతీతంగా తీసుకుని, మఠాధిపతులు, పీఠాధిపతులు, ధార్మిక పెద్దలు, సమాజంలోని బాధ్యత గల వ్యక్తులు అందరూ కలిసి ఒక రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి వాస్తవాలు తెలుసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
తప్పు జరిగిందని అంగీకరించి, భక్తుల మనోభావాలకు క్షమాపణ చెప్పాల్సిన వారు ప్రెస్ మీట్లు పెట్టి ఎదురు దాడి చేయడం పైశాచిక ఆనందంగా మారిందని విమర్శించారు.
తిరుమలతో పాటు ఇతర ఆలయాల్లో కూడా లడ్డూ సరఫరా ద్వారా భక్తుల మనోభావాలకు తీవ్రంగా దెబ్బ తగిలిన విషయాన్ని గుర్తించి, సమాజం అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ధర్మాన్ని కాపాడటం అంటే ద్వేషం కాదు. భక్తుల మనోభావాలను గౌరవించడమే నిజమైన ధర్మ రక్షణ. ఈ అంశంపై ప్రతి హిందూ భక్తుడు ధైర్యంగా మాట్లాడాలని మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు.