అక్షర ఉదయమ్ – తెనాలి
భారత కమ్యూనిస్టు పార్టీ 27వ మహాసభలు నెల్లూరులో జరగనున్న సందర్భంగా తాడేపల్లి నుంచి నెల్లూరుకు వెళుతున్న జాతా తెనాలి పట్టణానికి చేరుకుంది. తెనాలి మార్కెట్ సెంటర్లో జాతాకు సిపియం నాయకులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రజలపై మోపిన విద్యుత్ భారాన్ని తగ్గించాలని, ప్రపంచ బ్యాంక్ రాజధాని కాదు ప్రజల రాజధాని కట్టాలని, అప్పుగా కాకుండా కేంద్రం నుంచి హక్కుగా రావాల్సిన నిధులు తీసుకుని వచ్చి అమరావతి రాజధాని నిర్మాణం చేపట్టాలని, రాజధాని నిర్మాణ పనులను స్థానికులకే అప్పగించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ఏర్పడి అరు మాసాలు దాటినా రైతులకు పంటలకు ఇస్తానన్న నిధులు విడుదల చేయలేదని, వాటిని వెంటనే విడుదల చేయాలని కోరారు.

గత ప్రభుత్వం రాజధాని పేరిట మూడు ముక్కల ఆట అడినట్టు కాకుండా రాజధాని అమరావతే అని వెంటనే చట్టం చెయ్యాలని, విశాఖ ఉక్కుకి ఘనులు కేటాయించి తక్షణమే ప్రైవేటీకరణ ఆపుతునట్టు స్పష్టమైన ప్రకటన చెయ్యాలని డిమాండ్ చేశారు. నెల్లూరులో జరిగే మహా సభల్లో చర్చించే అంశాలు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళతామని, ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను వెంటనే అమలు చెయ్యాలని లేని పక్షంలో ప్రజా ఉద్యమానికి సిద్దం అవుతామని హెచ్చరించారు. నెల్లూరులో జరిగే మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
తొలుత ప్రజా నాట్య మండలి నాయకులు వెనుజుల సుబ్బారావు, నాగిరెడ్డి, రాజ్యలక్ష్మి, చల్లపల్లి కిన్నెర తదితరులు విప్లవ గీతాలు ఆలపించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి యార్లగడ్డ నేతాజీ, ఎం.భావనారాయణ, ఎం.రవి, బూరగడ్డ వెంకటేశ్వరరావు, కొల్లిపర బాబు, ప్రసాద్, మొలక శివ సామిరెడ్డి, రవీందర్రావు, గద్దె రవీందరరావు, షేక్ హుస్సేన్ వల్లి, గండికోట వెంకట సుబ్బయ్య, ఎస్.సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.