913 ఆశా పోస్టుల భర్తీకి ఆమోదం – మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి

📰 Generate e-Paper Clip

913 ఆశా పోస్టుల భర్తీకి ఆమోదం

 

  • మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడి
  • కూటమి ప్రభుత్వ హయాంలో ఇప్పటికే 1,294 పోస్టుల భర్తీ 

 

 

అక్షర ఉదయమ్ – అమరావతి

 

ప్రజల ముంగిటకు వైద్య సేవలు చేరువ చేయడంలో కీలకంగా వ్యవహరించే ఆశా కార్యకర్తల్లో ప్రస్తుతం ఖాళీగా ఉన్న 913 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపినట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. వీటి భర్తీతో రాష్ట్రంలోని ఆశా పోస్టులన్నీ భర్తీ అయినట్లు అవుతుందని పేర్కొన్నారు. జీరో వెకెన్సీ విధానంలో ఈ పోస్టుల భర్తీ చేపడుతున్నామని తెలిపారు. గడిచిన రెండు సంవత్సరాల్లో 1,294 ఆశా పోస్టులను భర్తీ చేశామని, తాజా 913 పోస్టులతో కలిపితే మొత్తం 2,207 పోస్టులు భర్తీ చేసినట్లు అవుతుందని మంత్రి తెలిపారు. తాజా ఖాళీల్లో 673 గ్రామీణ, 64 గిరిజన, 176 పట్టణ పోస్టులు ఉన్నాయని వెల్లడించారు.

 

  • డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ద్వారా

 

కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ పోస్టుల భర్తీ జరగనుంది. జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా ఉన్న డిస్ట్రిక్ట్ హెల్త్ సొసైటీ ద్వారా నియామకాలు చేపట్టనున్నారు. సంబంధిత గ్రామం లేదా వార్డుకు చెందిన స్థానిక మహిళల్లో పదో తరగతి కనీస అర్హత కలిగి, 25-45 ఏళ్ల మధ్య వయసున్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నారు. నియమ నిబంధనలను అనుసరించి ఈ నెల 30వ తేదీ నాటికి నియామకాల జాబితాను పంపించాలని జిల్లాలకు ఆదేశాలు జారీ చేసినట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ చక్రధర్ బాబు తెలిపారు.

 

  • జిల్లాల వారీగా పోస్టుల వివరాలు 

 

జిల్లాల వారీగా చూస్తే అనకాపల్లిలో 77, కర్నూలులో 65, తూర్పు గోదావరిలో 44, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 43, పార్వతీపురం మన్యంలో 43, పశ్చిమ గోదావరిలో 42, అన్నమయ్యలో 41, ప్రకాశంలో 38, వైఎస్సార్ కడపలో 38, కృష్ణాలో 37, విశాఖపట్నంలో 33, చిత్తూరులో 32, కోనసీమలో 32, పల్నాడులో 31, విజయనగరంలో 31, కాకినాడలో 29, ఎస్‌పీఎస్‌ఆర్ నెల్లూరులో 29, ఏలూరులో 27, అనంతపురంలో 26, మార్కాపురంలో 25, శ్రీ సత్యసాయి జిల్లాలో 22, శ్రీకాకుళంలో 22, గుంటూరులో 21, నంద్యాలలో 21, పోలవరంలో 21, తిరుపతిలో 21, ఎన్టీఆర్ జిల్లాలో 15, బాపట్లలో 7 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

 

  • నెలకు రూ 10,000 వేతనం

 

ఒక్కో ఆశా కార్యకర్తకు నెలకు రూ.10 వేల చొప్పున వేతనం లభిస్తుంది. ఇందులో రూ.8,320 రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్ ద్వారా, మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ప్రతి ఏడాది ఆశా కార్యకర్తలకు వేతనాల రూపంలో రూ.513 కోట్ల వరకు చెల్లింపులు జరుగుతున్నాయి. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం రూ.426.84 కోట్ల వరకు భరిస్తుండగా, మిగిలిన మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోంది.